మేక‌పాటి ఫ్యామిలీ దాతృత్వం.. గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రి వ‌ర్సిటీ

  • వంద ఎక‌రాల్లో మెరిట్స్ క‌ళాశాల
  • రూ.225 కోట్ల విలువైన ఆస్తులు ప్ర‌భుత్వానికి స్వాధీనం
  • అందులో అగ్రిక‌ల్చ‌ల‌ర్ వ‌ర్సిటీ ఏర్పాటుకు జ‌గ‌న్ ఓకే
  • అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానం చేస్తామంటూ జ‌గ‌న్ హామీ
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు, ఇటీవ‌లే గుండెపోటుతో మృతి చెందిన యువ రాజ‌కీయ‌వేత్త మేక‌పాటి గౌతమ్ రెడ్డి కుటుంబం అంత‌టి దుఃఖంలోనూ గొప్ప మ‌న‌సును చాటుకుంది. నెల్లూరు మాజీ ఎంపీ, గౌత‌మ్ రెడ్డి తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి త‌న కుమారుడి అంత్య‌క్రియ‌ల రోజునే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రిగిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌)ను, దానికున్న రూ.225 కోట్ల ఆస్తుల‌ను ప్ర‌భుత్వానికి స్వ‌చ్ఛందంగా ఇవ్వ‌నున్న‌ట్లుగా సీఎం జ‌గ‌న్‌కు చెప్పారు. దానికి ప్ర‌తిగా త‌మ‌కేమీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, మెరిట్స్‌ను అగ్రిక‌ల్చ‌ర్ విశ్వ‌విద్యాల‌యంగా మార్చి దానికి త‌న కుమారుడి పేరు పెట్టాల‌ని రాజ‌మోహ‌న్ రెడ్డి కోరారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు సీఎం జ‌గ‌న్ అక్క‌డిక‌క్క‌డే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో దీనికి సంబంధించిన తీర్మానాన్ని చేస్తామ‌ని కూడా రాజ‌మోహ‌న్ రెడ్డికి జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది‌. ఉద‌య‌గిరిలోని మెరిట్స్ క‌ళాశాల‌ను మేక‌పాటి ఫ్యామిలీ ఏకంగా వంద ఎక‌రాల్లో ఏర్పాటు చేసింది. ఈ మొత్తం భూముల‌తో పాటు వాటిలో నిర్మించిన భ‌వ‌న స‌ముదాయాల‌ను కూడా ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తామ‌ని రాజ‌మోహ‌న్ రెడ్డి చెప్పారు.

ఉద‌య‌గిరితో పాటు గౌత‌మ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన ఆత్మ‌కూరులోని మెట్ట ప్రాంతాల అభివృద్ధికి తాము ఎంత‌గానో కృషి చేశామ‌ని, ఇప్పుడు త‌మ ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌భుత్వం ఒప్పుకుని మెరిట్స్‌ను అగ్రి వ‌ర్సిటీగా తీర్చిదిద్దితే త‌మ క‌ల సాకారం అవుతుంద‌ని రాజ‌మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు.


More Telugu News