రష్యా–ఉక్రెయిన్ వార్: పెరుగుతున్న ముడి చమురు ధరలు.. మళ్లీ 2014 నాటి గరిష్ఠ స్థాయికి

  • 105.79 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
  • 101.54 డాలర్ల వద్ద వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర
  • బ్యారెల్ ధర 170 డాలర్లకు చేరచ్చని ఆందోళన  
  • అదే జరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం
ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. వాటి ధరలు మళ్లీ 2014 నాటి గరిష్ఠ స్థాయిని తాకాయి. దీంతో ఈ ఏడేళ్లలో తొలిసారిగా నిన్న బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో చమురు ధర 7.3 శాతం పెరిగి 103.9 డాలర్లకు చేరింది. అదికాస్తా మధ్యాహ్నం 12.47 గంటలకు 105.79 డాలర్లకు పెరిగింది. ఇక, అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు బ్యారెల్ ధర 2 డాలర్లు పెరిగి 101.54 వద్ద సెటిల్ అయింది. 2014 జులైలో బ్రెంట్ క్రూడ్ ధర 105 డాలర్లుగా ఉంది.

అయితే, చమురు ధరల పెరుగుదల ఇక్కడితో ఆగిపోదని, మరింత పెరిగే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా నుంచి తగినంత సరఫరా కాకపోయినా, ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందంపై ‘వియన్నా చర్చలు’ ఫలించకపోయినా బ్యారెల్ చమురు ధర 150 డాలర్ల నుంచి 170 డాలర్లకు చేరే ప్రమాదం ఉంటుందని హాంకాంగ్ కు చెందిన యూబీపీ అనే పెట్రోలియం సంస్థ సీనియర్ ఎకనామిస్ట్ కార్లోస్ కాసనోవా చెప్పారు. తద్వారా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.

చమురు ధర 150 డాలర్లకు చేరితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మూడొంతులు పడిపోతుందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో ఆర్థిక వృద్ధి 1 శాతం కన్నా తక్కువ నమోదవుతుందని జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో గత నెలలో అంచనా వేసిన సంగతి తెలిసిందే.

మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు

ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో రష్యా మూడో అతిపెద్ద దేశంగా ఉంది. అంతేగాకుండా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కూడా. అమెరికా, చైనా సహా వివిధ దేశాలకు విద్యుత్ /గ్యాస్ ను సరఫరా చేస్తున్న టాప్ దేశాల జాబితాలోనూ రష్యా ఉంది. అమెరికా దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో 7 శాతం వాటా రష్యాదే కావడం గమనార్హం.

ఇటు భారత దిగుమతుల్లోనూ ఒక శాతం వాటా రష్యా చమురే ఉంటోంది. గత ఏడాది భారత్ రోజుకు సగటున 43,400 బ్యారెళ్ల చొప్పున రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. సహజ వాయువు దిగుమతుల్లోనూ 0.2 శాతం రష్యా నుంచే తీసుకుంటోంది. అయితే, మన మొత్తం దిగుమతుల్లో రష్యా చమురు అతి స్వల్పమే అయినా.. ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ ధరను బట్టి మన దేశంలోనూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News