యుద్ధంలో ఒంటరైపోయాం.. మనకోసం ఎవరూ రారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగం

  • అందరూ భయపడుతున్నారు
  • విదేశాల నుంచి సాయం ఆశించొద్దు
  • నేనెక్కడికీ పారిపోలేదు
  • కుటుంబంతో పాటు కీవ్ లోనే ఉన్నాను
  • నన్ను చంపి దేశాన్ని రాజకీయంగా దెబ్బకొట్టాలని రష్యా కుట్ర
రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. ఇవాళ ఉదయం ఆయన ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, భావోద్వేగానికి లోనయ్యారు. తాను దేశం విడిచిపారిపోయానన్న వదంతులు వస్తున్నాయని, తానెక్కడికీ పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధంలో ఒంటరైపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మనతో కలిసి యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాకు ఎవరూ కనిపించట్లేదు. నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్ కు ఎవరు హామీ ఇవ్వగలరు? అందరూ భయపడుతున్నారు’’ అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ప్రజలు ఇక ఆశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

రష్యా దాడుల్లో బలగాలు, సాధారణ ప్రజలు సహా ఇప్పటికే 137 మంది మంది చనిపోయారని, మరో 316 మంది గాయపడ్డారని చెప్పారు. రష్యా విధ్వంసక బృందాలు దేశంలోకి చొరబడ్డాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జాగ్రత్త చెప్పారు. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తాను, తన కుటుంబం దేశంలోనే ఉన్నామని, రష్యా తనను టార్గెట్ నెంబర్ 1గా, తన కుటుంబాన్ని టార్గెట్ నెంబర్ 2గా చూస్తోందని చెప్పారు. అయితే తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని ప్రస్తుతానికి చెప్పలేనన్నారు. దేశాధ్యక్షుడిని చంపేయడం ద్వారా దేశాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ప్రశాంతమైన నగరాలపై దాడులు చేస్తూ అమాయక జనాన్ని చంపేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీల మీద దాడిచేస్తూ మిలటరీ లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నామంటూ రష్యా అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు.


More Telugu News