ఉక్రెయిన్‌లో బంకర్‌లో తలదాచుకున్న బాపట్ల విద్యార్థి.. తండ్రికి ఫోన్

  • ఉక్రెయిన్‌పై యుద్ధ విమానాలతో విరుచుకుపడుతున్న రష్యా
  • వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు
  • యూనివర్సిటీ అధికారుల సహకారంతో బంకర్లలో తలదాచుకుంటున్న విద్యార్థులు
  • గంటగంటకు వీడియో కాల్‌చేసి మాట్లాడుతున్న తల్లిదండ్రులు
ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు కురిపిస్తున్న వేళ అక్కడి వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్వదేశానికి చేరుకునే వీలులేకపోవడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వందలాదిమంది తెలుగు విద్యార్థులు ఇప్పుడు అక్కడ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ఉడతా సాయి నోషిత ఉక్రెయిన్‌లోని జఫ్రోజియాలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఇక్కడ పురపాలక సంఘంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినప్పటికీ గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా వెనక్కి వచ్చింది.

ఈ నేపథ్యంలో అక్కడున్న విద్యార్థులు బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. తాజాగా సాయి నోషిత తల్లిదండ్రులు కుమార్తెతో ప్రతీ గంటకు ఒకసారి వీడియో కాల్‌చేసి మాట్లాడుతున్నారు. జఫ్రోజియాలోని జెడ్ఎస్ఎంయూ విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో నాలుగో ఏడాది చదువుతున్న నోషితతో పాటు.. తెనాలి, గుంటూరు, చీరాలకు చెందిన సహచర విద్యార్థులు కళాశాల అధికారుల సహకారంతో ముందు జాగ్రత్తగా బంకర్లలో తలదాచుకున్నారు. ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా చెబుతూ ఆందోళన వద్దని చెబుతూ ఊరడిస్తున్నారు.


More Telugu News