ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థినులు... కేంద్రానికి బండి సంజయ్ లేఖ

  • ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా
  • మూడు వైపులా రష్యా బలగాల మోహరింపు
  • ఉక్రెయిన్ గగనతలం మూసివేత
  • విమానాల్లేక భారత విద్యార్థుల అవస్థలు
  • కీవ్ ఎయిర్ పోర్టులో 20 మంది భారత విద్యార్థులు
ఉక్రెయిన్ పై ఏ క్షణాన్నయినా రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులు వెంటనే వెళ్లిపోవాలని గత కొన్నిరోజులుగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఇవాళ రష్యా శరంపరగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు బయటికి వచ్చే మార్గంలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఉక్రెయిన్ ను మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, గగనతల మార్గాన్ని మూసివేశారు. దాంతో, 20 మంది వరకు భారత విద్యార్థులు అక్కడి కీవ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కూడా ఉన్నారు. వారి పేర్లు రమ్య శ్రీ, నిఖిత, కడారి సుమాంజలి, శ్రీనిధి. వీరు ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా వైద్య విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నారు.

కాగా, కరీంనగర్ కు చెందిన కడారి సుమాంజలి... కీవ్ ఎయిర్ పోర్టులో తాము అవస్థలు పడుతున్న సంగతిని సోదరుడికి ఫోన్ ద్వారా తెలియపర్చింది. దాంతో ఆమె సోదరుడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి విషయం తెలియజేశారు. వెంటనే స్పందించిన సంజయ్... ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థినులతో పాటు భారత విద్యార్థులను ఆదుకోవాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు. వారిని క్షేమంగా భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News