ఏం జరుగుతుందో ?.. మమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేస్తే చాలు.. భారత విద్యార్థుల ఆవేదన

  • కీవ్ రైల్వే స్టేషన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులు
  • భారత్ కు తిరిగి రావడానికి వీల్లేని పరిస్థితి
  • నిలిచిపోయిన ప్రజా రవాణా
  • యూనివర్సిటీకి తిరిగి వెళ్లే అవకాశాలు బంద్
ఉక్రెయిన్ లోని భారత విద్యార్థులను వెనక్కి వచ్చేయాలని కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖ కోరుతున్నా.. పట్టించుకోని విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రష్యా యుద్ధానికి దిగకపోవచ్చన్న అంచనాలు, వ్యయ భారాన్ని చూసి వారు అక్కడి నుంచి కదలకపోవడం, ఇప్పుడు యుద్ధం ఆరంభం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అటువంటి వారిలో శివ కూడా ఒకడు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించినట్టు తెలుసుకున్న శివ, అతడి తోటి భారతీయ విద్యార్థులు 50 మంది వెంటనే బ్యాగ్ సర్దుకుని రైలు ద్వారా రాజధాని కీవ్ కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం ద్వారా వెనక్కి వచ్చేద్దామని వారి ఆలోచన. కానీ, గగనతలాన్ని ఉక్రెయిన్ మూసివేయడంతో ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా వెనుదిరిగింది.

కీవ్ కు చేరుకున్న భారత విద్యార్థుల బృందానికి ఎయిర్ స్పేస్ మూసేసిన విషయం తెలిసింది. తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోదామన్నా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అతడితోపాటు 50 మంది భారత విద్యార్థులు కీవ్ రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయారు.

‘‘ఏం జరుగుతుందో చెప్పలేను. మమ్మల్ని కాపాడేందుకు విమానాన్ని ఏర్పాటు చేయాలి. భారత్ వెళ్లిపోతాం’’ అని శివ చెప్పాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, కొందరు విద్యార్థులు భారత ఎంబసీని సంప్రదించినట్టు తెలిపాడు. అంతర్జాతీయ విద్యార్థులను యూనివర్సిటీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజారవాణా అందుబాటులోకి వస్తే తిరిగి యూనివర్సిటీకి అయినా వెళ్లిపోతామని చెప్పాడు.


More Telugu News