ఉక్రెయిన్ ఎయిర్​బేస్​లు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసిన రష్యా

  • ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం చొరబాట్లు
  • రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్ర‌క‌ట‌న‌
  • తీవ్ర భ‌యాందోళ‌న‌ల్లో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు
ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం చొరబడిన‌ట్లు ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ అధికారికంగా ప్రకటన చేసింది. అలాగే, ఉక్రెయిన్ ఎయిర్ బేస్‌, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది.

అలాగే, ప‌లు విమానాల‌ను కూడా ర‌ష్యా ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధం జ‌రుగుతోన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. కొంద‌రు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకుంటున్నారు. మరోపక్క, ఉక్రెయిన్ సైన్యం ఏ మాత్రం బెద‌ర‌కుండా త‌మ దేశం కోసం ర‌ష్యాపై పోరాడుతోంది. ఇప్ప‌టికే ప‌లు యుద్ధ విమానాల‌ను ధ్వంసం చేసింది.

రష్యా యుద్ధం ప్రారంభించి, ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేస్తుండ‌డంతో ఉక్రెయిన్‌లోని విదేశీయులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులను మూసివేసింది. ఉక్రెయిన్ లోని విదేశీయులు త‌మ సొంత దేశాల‌కు వెళ్ల‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అక్క‌డి నుంచి మ‌ళ్లీ పౌర విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.


More Telugu News