కచోరి కోసం రైలునే ఆపేశాడు.. ఉద్యోగాన్ని రిస్క్ లో పడేసుకున్న లోకో పైలట్

  • రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఘటన
  • స్టేషన్ దాటిన తర్వాత బ్రేక్ వేసిన లోకో పైలట్
  • కచోరి ప్యాకెట్ తెచ్చిచ్చిన గేట్ మ్యాన్
  • ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
రైలు వేగంగా వెళుతోంది. విండో నుంచి బయటకు చూసినప్పుడు నచ్చిన ఆహార పదార్థం కనిపిస్తే పరిస్థితి ఏంటి? కారు మాదిరిగా రైలును ఆపేసి కొనుక్కోగలమా? సాధ్యం కాదు. రైలును నడిపే లోకో పైలట్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనకు నచ్చిన కచోరి తినాలనిపించింది. అంతే స్టేషన్ దాటిన వెంటనే బ్రేక్ వేసి ఆపేశాడు. ఒక వ్యక్తి తీసుకొచ్చిన కచోరి పార్సిల్ కవర్ ను తీసుకుని అంతే వేగంగా రైలును ముందుకు పోనిచ్చాడు.

రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఒక ట్విట్టర్ యూజర్ దీన్ని షేర్ చేశాడు. కొందరు దీన్ని తప్పుబడితే, మరికొందరు నెట్టింట సమర్థించారు. చట్టవిరుద్ధంగా పైలట్ ఎలా వ్యవహరిస్తాడని కొందరు ప్రశ్నించారు.

దీంతో నార్త్ వెస్టర్న్ రైల్వే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రైలును నడిపిన లోకో పైలట్, అదే రైలులోని అసిస్టెంట్ లోకోపైలట్, ఇద్దరు గేట్ మ్యాన్ లు, స్టేషన్ మేనేజర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నార్త్ వెస్టర్న్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికిరణ్ మాట్లాడుతూ.. ‘‘మా దృష్టికి ఒక వీడియో వచ్చింది. అందులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కు గేట్ మ్యాన్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఉంది. వెంటనే చర్యలు తీసుకున్నాం’’ అని ప్రకటించారు.


More Telugu News