‘పంజాబ్’ కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదు: మయాంక్ అగర్వాల్

  • బాధ్యతలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధమే
  • ఇవ్వకపోయినా నా వంతుగా సేవలు అందిస్తా
  • ఫ్రాంచైజీ ఇచ్చే ఏ బాధ్యతను అయినా నిర్వర్తిస్తానన్న మయాంక్ 
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ రేసులో ఉన్న మయాంక్ అగర్వాల్ ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు అట్టిపెట్టుకున్న ఇద్దరు ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ కూడా ఉన్నాడు. దీంతో అతడ్ని కెప్టెన్ గా ప్రకటించనున్నట్టు వార్తలు వచ్చాయి.

మరోవైపు మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను కూడా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ధావన్ కు లోగడ ఐపీఎల్ జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. దీంతో ధావన్ కూడా పంజాబ్ జట్టు కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు.

కానీ, ఇంత వరకు పంజాబ్ కింగ్స్ జట్టు అధికారికంగా కెప్టెన్ ను ప్రకటించలేదు. ఫ్రాంచైజీ సహ యజమాని మోహిత్ బర్మన్ అయితే ఒక ఇంటర్వ్యూలో మయాంక్ కెప్టెన్ కానున్నట్టు సంకేతం ఇచ్చారు. 2018 నుంచి మయాంక్ పంజాబ్ జట్టుకే ఆడుతున్నాడు. మొదటి ఏడాది అతడికి ఇచ్చింది రూ.కోటి. కానీ, ఈ ఏడాది అతడ్ని రూ.12 కోట్లకు జట్టు రిటెయిన్ చేసుకుంది.

‘‘అవకాశం ఇస్తే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కెప్టెన్ బాధ్యతలు నాకు ఇవ్వకపోయినా సరే, నా వంతుగా జట్టుకు సేవలు అందిస్తాను. ఫ్రాంచైజీ ఇచ్చిన ఏ బాధ్యతను అయినా చేపట్టేందుకు సుముఖమే. దీని గురించి పెద్దగా ఒత్తిడి తీసుకోవాలనుకోవడం లేదు. వాస్తవానికి అసలు నేను దీని గురించి ఆలోచించడమే లేదు’’ అని మయాంక్ అగర్వాల్ తన మనసులోని మాటను వెల్లడించాడు.


More Telugu News