ఆదాయం చూసుకోకుండా ఖ‌ర్చు పెట్టినవారు బాగుప‌డిన దాఖ‌లా లేదు: ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్

  • జ‌గ‌న్ స‌ర్కారు తీరు బెండు అప్పారావు సినిమాను గుర్తు చేస్తుంద‌ని వ్యాఖ్య‌
  • జ‌గ‌న్ పంచుతున్న డ‌బ్బు భార‌మంతా రాష్ట్ర ప్ర‌జ‌లే మోయక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌
  • జ‌గ‌న్ త‌న సొంత డ‌బ్బేమీ తెచ్చి పంచ‌డం లేద‌ని కామెంట్ 
ఏపీలోని వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై ఆ రాష్ట్ర మాజీ ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా కొన‌సాగుతున్న ఐవైఆర్ కృష్ణారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ స‌ర్కారు తీరు చూస్తుంటే బెండు అప్పారావు సినిమా గుర్తుకు వ‌స్తోందంటూ ఐవైఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. సంక్షేమం పేరిట జ‌గ‌న్ స‌ర్కారు తీసుకువ‌స్తున్న అప్పులు.. భ‌విష్య‌త్తులో ఏపీ ప్ర‌జ‌ల‌పైనే ప‌డ‌నున్నాయ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ల‌బ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం వేస్తున్న సొమ్ము జ‌గ‌న్ సొంతానిదేమీ కాద‌ని కూడా ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌ల‌మైన పునాదులు వేసిన కేంద్ర బ‌డ్జెట్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆర్థిక సంక్షోభం వైపు న‌డిపిస్తున్న వైకాపా ప్ర‌భుత్వం అన్న అంశం మీద బుధ‌వారం విజ‌య‌వాడ‌లో బీజేపీ నిర్వ‌హించిన స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐవైఆర్ కృష్ణారావు కీల‌కోప‌న్యాసం చేశారు. బ‌డ్జెట్‌ను ఎలా రూపొందించాల‌న్న విష‌యాన్ని కేంద్ర బ‌డ్జెట్‌ను చూస్తే స‌రిపోతుంద‌ని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక ఏపీ ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్ లో రూ.37 వేల కోట్ల‌ను అప్పుగా ప్ర‌తిపాదించి, ఆ వెంట‌నే రూ.57 వేల కోట్ల‌ను అప్పుగా తెచ్చి అప్పు భారాన్ని అమాంతంగా పెంచేశార‌న్నారు. ఆదాయం చూసుకోకుండా ఖ‌ర్చు పెట్టిన వారు బాగుప‌డిన దాఖ‌లా లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ త‌న సొంత డ‌బ్బేమీ తెచ్చి పంచ‌డం లేద‌ని, ల‌బ్ధిదారుల్లో జ‌మ అవుతున్న డ‌బ్బు అంతా అప్పు ద్వారా తెచ్చిన సొమ్మేన‌ని.. భవిష్య‌త్తులో ఆ భార‌మంతా రాష్ట్ర ప్ర‌జ‌ల‌పైనే ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News