మా దేవుడిని మాకు దూరం చేయవద్దు: పయ్యావుల కేశవ్

  • తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారు
  • టీటీడీ బోర్డు వ్యాపారవేత్తలతో నిండిపోయింది
  • సామాన్యులకు స్వామిని దూరం చేసే కుట్ర జరుగుతోంది
సామాన్య భక్తులకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దూరం చేసే కుట్ర జరుగుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా ఉంటున్నాయని విమర్శించారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే తిరుమలను వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు మొత్తం వ్యాపారవేత్తలతో నిండిపోయిందని... టీటీడీ బోర్డు మీటింగ్ వేలం పాటలా సాగిందని విమర్శించారు.

బోర్డు సమావేశంలో ధరలను పెంచడం... సామాన్యులకు స్వామిని దూరం చేయడమేనని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ఆంక్షలు ఎక్కడా లేకపోయినా... తిరుమలలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. టిక్కెట్ లేకపోతే తిరుపతి నుంచి తిరుమలకు పంపించడం లేదని దుయ్యబట్టారు.

టీటీడీ విధిస్తున్న నిబంధనలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని పయ్యావుల ప్రశ్నించారు. మీరు ఏ దేవుడిని పూజించుకున్నా తమకు అభ్యంతరం లేదని... కానీ, తమ దేవుడిని తమకు దూరం చేయవద్దని అన్నారు. అందరికీ సమాన దర్శనం, సమాన వసతి లేనప్పుడు సమాన భోజనం ఎందుకని అడిగారు. హోటల్ వ్యాపారంలోకి టీటీడీ వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీటీడీ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.


More Telugu News