సీఆర్డీఏకు 'హ్యాపీనెస్ట్' క‌స్ట‌మ‌ర్ల లీగ‌ల్ నోటీసులు

  • చంద్ర‌బాబు హ‌యాంలో హ్యాపీనెస్ట్‌కు అంకురార్ప‌ణ‌
  • 1,200 ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన వైనం
  • 2021 డిసెంబ‌ర్ 31 నాటికే ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు అందించాలి
  • గ‌డువు ముగియ‌డంతో సీఆర్డీఏకు కొనుగోలుదారుల నోటీసులు
ఏపీ రాజ‌దాని అమ‌రావ‌తి ప‌రిధిలో అత్యాధునిక హంగుల‌తో నివాస స‌ముదాయాల‌ను నిర్మిస్తామ‌న్న నాటి చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌కు అప్పట్లో విశేష స్పంద‌న ల‌భించింది. అందులో భాగంగా 1,200 ఫ్లాట్ల‌తో కూడిన హ్యాపీనెస్ట్ బుకింగ్‌లు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే ముగిశాయి. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ట్ ఫ్లాట్ల కొనుగోలుదారులు ఏపీసీఆర్డీఏకు ఏకంగా లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు. 1,200 ఫ్లాట్ల కొనుగోలుదారుల్లో 28 మంది ఈ నోటీసుల‌ను త‌మ న్యాయ‌వాదుల ద్వారా సీఆర్డీఏకు పంపారు.

నాడు ఫ్లాట్ల బుకింగ్ సంద‌ర్భంగా ఫ్లాట్లు ద‌క్కించుకున్న వారు మొత్తం ఖ‌రీదులో 10 శాతాన్ని సీఆర్డీఏకు చెల్లించారు. నాడు కుదిరిన ఒప్పందం మేర‌కు 2021 డిసెంబ‌ర్ 31 నాటికి ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు సీఆర్డీఏ అప్ప‌గించాల్సి ఉంది. బుకింగ్‌లు ముగిసిన వెంట‌నే టెండ‌ర్లు పిల‌వ‌గా.. షాపూర్‌జీ ప‌ల్లోంజీ సంస్థ నిర్మాణ ప‌నుల‌ను ద‌క్కించుకుంది. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వ‌డంతో రాజ‌దానిపై నీలినీడ‌లు క‌మ్ముకున్న నేప‌థ్యంలో హ్యాపీనెస్ట్ నిర్మాణం నిలిచిపోయింది. దీంతో ఒప్పందం నిబంధ‌న‌ల మేర‌కు కొనుగోలుదారుల‌కు ఫ్లాట్లు చేతికంద‌లేదు.

గ‌డువు ముగిశాక నెల‌న్న‌ర పైగానే వేచి చూసిన కొనుగోలుదారులు ఇక లాభం లేద‌నుకుని సీఆర్డీఏకు లీగ‌ల్ నోటీసులు పంపారు. ఈ నోటీసుల్లో తాము చెల్లించిన 10 శాతం సొమ్ముకు 14 శాతం వ‌డ్డీ క‌లిపి చెల్లించాల‌ని, న‌ష్ట‌ప‌రిహారం కింద మ‌రో రూ.20 ల‌క్ష‌లు చెల్లించాల‌ని వారు కోరారు. మ‌రి ఈ నోటీసుల‌కు సీఆర్డీఏ గానీ, జ‌గ‌న్ స‌ర్కారు గానీ ఎలా స్పందిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


More Telugu News