సుకేశ్ చంద్రశేఖర్ మామూలోడు కాదు.. ఆ భామలకూ గురి పెట్టాడట!

  • రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు
  • జాన్వికపూర్, సరా అలీఖాన్, భూమి పెడ్నేకర్ లకు ఖరీదైన బహుమతులు
  • ఈడీ అధికారులకు వెల్లడించిన సుకేశ్
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ దర్యాప్తు అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడిస్తున్నాడు. అతడి బాధితుల జాబితాలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహితో అతడు నెరపిన సన్నిహిత సంబంధాల వివరాలు ఇప్పటికే వెలుగు చూశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అతడు ఈ ఇద్దరు భామలకు ఖరీదైన బహుమానాలు ఇవ్వడం తెలిసిందే.

ఈ మోసగాడు మరో ముగ్గురు నటీమణులనూ లక్ష్యం చేసుకున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. సరా అలీఖాన్, జాన్వి కపూర్, భూమి పెడ్నేకర్ పేర్లను సుకేశ్ చంద్రశేఖర్ తాజాగా బయటపెట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్ వీరికి సైతం ఖరీదైన బహుమానాలు పంపించాడని తెలిసింది.

ప్రస్తుతం సుకేశ్ విచారణ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నాడు. ఉద్యోగాల ఆశ చూపి 100 మందికి పైగా రూ.75 కోట్ల మేర మోసం చేశాడన్న ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నాడు. ర్యాన్ బ్యాక్సీ ఫార్మా మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితిసింగ్ ను రూ.215 కోట్ల మేర మోసం చేశాడన్న కేసు కూడా ఇతడిపై నమోదై ఉంది.


More Telugu News