‘ఒమిక్రాన్’ ప్రభావం లేదన్న న్యాయవాది.. కంగుతినే బదులిచ్చిన చీఫ్ జస్టిస్ రమణ

  • పూర్తి స్థాయి భౌతిక విచారణలు ప్రారంభించండి
  • ఒమిక్రాన్ ఓ వైరస్ జ్వరం మాదిరి
  • పెద్ద ప్రభావం చూపించడం లేదన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 
  • 25 రోజుల తర్వాత కూడా బాధ పడుతున్నానన్న చీఫ్ జస్టిస్ 
ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా లేదని, సుప్రీంకోర్టులో కేసుల విచారణను పూర్తి స్థాయిలో భౌతికంగా నిర్వహించాలంటూ కోరిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ కు.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నుంచి ఊహించని సమాధానం వచ్చింది.

‘‘సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణలు ప్రారంభించాలని కోరుతున్నాను. ఒమిక్రాన్ అన్నది ఒక వైరల్ జ్వరం వంటిది. దీని నుంచి వెంటనే కోలుకుంటున్నారు. ఇది చాలా స్వల్పమైనది’’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో అన్నారు.

దీనికి చీఫ్ జస్టిస్ రమణ సీరియస్ గా స్పందించారు. ‘‘నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. నాలుగు రోజుల పాటు దీన్ని ఎదుర్కొన్నాను. కానీ, ఇప్పటికీ దీని దుష్ప్రభావాలు చూస్తున్నాను. ఇది సైలంట్ కిల్లర్ (పైకి తెలియకుండా హాని చేస్తుంది). మీకు తెలుసు. కరోనా మొదటి విడతలోనూ నేను వైరస్ బారిన పడి త్వరగా కోలుకున్నాను. కానీ ఈ విడతలో వైరస్ నుంచి కోలుకుని 25 రోజులు దాటినా, ఇప్పటికీ దాని తాలూకూ బాధను చవిచూస్తూనే ఉన్నాను. కేసుల సంఖ్య 15,000కు చేరుకుంది’’ అని ఎన్వీ రమణ బదులిచ్చారు.

ఆ విషయంలో మీరు అదృష్టవంతులు కాదని, ప్రజలు మాత్రం చక్కగా కోలుకుంటున్నారని వికాస్ సింగ్ అన్నారు. పరిస్థితులను సమీక్షించి కోర్టు నిర్ణయం తీసుకుంటుందని దీనికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముగింపు పలికారు.


More Telugu News