ఓ వ్యక్తి కుప్పకూలిపోతే ఏం చేయాలి?... డాక్టర్ ముఖర్జీతో రాజమౌళి చేసిన అవగాహనా వీడియో

  • ఏపీ మంత్రి మేకపాటి హఠాన్మరణం నేపథ్యంలో అవగాహనా వీడియో  
  • కీలక సమాచారంతో రాజమౌళి, డాక్టర్ ముఖర్జీ కలిసి చేసిన ప్రయత్నం 
  • వ్యక్తిని కాపాడడంపై పలు అంశాలు వివరించిన వైద్యుడు
  • వీడియో చూసి అవగాహన పెంచుకోవాలన్న రాజమౌళి
ఏపీ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అందరి దృష్టి ఇప్పుడు కుప్పకూలిపోవడం, గుండెపోటు వంటి ఆరోగ్యపరమైన అంశాలపై పడింది. కాగా గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో, ప్రముఖ కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ ముఖర్జీ ఆసక్తికరమైన వీడియో చేశారు. ఇందులో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా ఉండడం విశేషం.

మీకు సమీపంలో ఎవరైనా కుప్పకూలిపోతే వారిని ఎలా కాపాడాలి? అత్యవసర పరిస్థితుల్లో ఏంచేయాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ముఖర్జీ దర్శకుడు రాజమౌళితో వివరణాత్మకంగా చర్చించారు. అంతేకాదు, వ్యక్తి కుప్పకూలిన సమయంలో ఎలా వ్యవహరించాలన్నది కూడా ప్రదర్శించారు. ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. దీనిపై రాజమౌళి స్పందించారు.

"డాక్టర్ ముఖర్జీతో ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఎంతో సమాచారాన్ని అందించగలిగాం. మీ చుట్టుపక్కల ఎవరైనా కుప్పకూలిపోతే ఎలా కాపాడాలి? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనేది డాక్టర్ గారు చక్కగా వివరించారు. ఎవరైనా కుప్పకూలిపోతే భయాందోళనలకు గురికాకండి. ఈ వీడియో చూసి ప్రాణాలు కాపాడే కొన్ని సులభమైన చర్యలపై అవగాహన పెంచుకోండి" అని వివరించారు.


More Telugu News