సీఎం హోదాలో తొలి విదేశీ టూర్‌కు స్టాలిన్ రెడీ

  • సీఎం హోదాలో ఇప్ప‌టిదాకా ఫారిన్ టూర్ వెళ్ల‌ని స్టాలిన్
  • వ‌చ్చే నెల‌లో దుబాయిలో పారిశ్రామిక సద‌స్సు
  • ఈ స‌ద‌స్సుకు త‌మిళ‌నాడు బృందానికి స్టాలిన్ నేతృత్వం
త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్.. ప‌ద‌వి చేపట్టిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే సమర్ధుడైన ముఖ్య‌మంత్రిగా ప్ర‌శంస‌లందుకుంటున్న విష‌యం తెలిసిందే. సీఎం కుర్చీలో కూర్చుని కూడా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, ఎన్నిక‌లు ముగియ‌గానే రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌ప‌డేసి విప‌క్షాల‌నూ ఆత్మీయులుగా ప‌రిగ‌ణిస్తూ ఆయన సాగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

సీఎంగా త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న‌ను అందించాల‌న్న ల‌క్ష్యంతో క‌దులుతున్న స్టాలిన్‌.. దుబారాకు ఆమ‌డ దూరంలో ఉంటున్న సంగ‌తీ తెలిసిందే. గ‌తేడాది మే 7న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్టాలిన్ ఇప్ప‌టిదాకా విదేశీ ప‌ర్య‌ట‌న అన్న మాటే ఎత్త‌లేదు. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి దాదాపు ఏడాది కావ‌స్తున్న త‌రుణంలో ఇప్పుడు ఆయ‌న త‌న తొలి ఫారిన్ టూర్‌కు రెడీ అయిపోతున్నారు.

మార్చిలో దుబాయ్‌లో పెట్టుబడుల మహానాడు జ‌ర‌గ‌నుంది. దాదాపుగా 192 దేశాల‌కు చెందిన పారి‌శ్రామిక వేత్త‌లు ఈ మ‌హానాడుకు హాజ‌ర‌వుతున్నార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న స్టాలిన్‌.. ఆ స‌ద‌స్సుకు వెళ్ల‌డం ద్వారా త‌న రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించారు. దాంతో ఈ స‌ద‌స్సుకు హాజరయ్యే త‌మిళ‌నాడు ప్ర‌తినిధి బృందానికి తానే నేతృత్వం వ‌హించాల‌ని కూడా ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సీఎం హోదాలో వ‌చ్చే నెల‌లో ఆయ‌న త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరేందుకు రెడీ అయిపోతున్నారు.


More Telugu News