డేరా బాబాకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

  • సాధ్వీల‌పై అత్యాచారం, జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసుల్లో దోషి
  • 21 రోజుల పెరోల్‌పై ఈ నెల 7న జైలు నుంచి విడుద‌ల‌
  • ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదుల నుంచి ముప్పు ఉందంటూ సెక్యూరిటీ
అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్ (డేరా బాబా)కు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త ల‌భించింది. ఈ మేర‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం మంగ‌ళవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జైలు శిక్ష అనుభ‌విస్తున్న‌ డేరా బాబా ఇటీవలే పెరోల్ పై జైలు నుంచి విడుదలైన సంగ‌తి తెలిసిందే. సాధ్వీలపై అత్యాచారం, ఓ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసులో డేరా బాబా దోషిగా తేలారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెరోల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత డేరాబాబాను ఖలిస్థానీ తీవ్రవాదులు టార్గెట్ చేశారనే వార్తలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో  డేరా బాబాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

జైలు శిక్ష అనుభవిస్తున్న స‌మ‌యంలోనే పెరోల్ కోసం డేరా బాబా చాలా కాలం నుంచి య‌త్నిస్తున్నారు. సరిగ్గా పంజాబ్ ఎన్నికల సమయంలోనే ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించిన కోర్టు 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఫిబ్రవరి 7న జైలు నుంచి విడుదలైన‌ డేరా బాబా బయటికి రావడంతో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయ‌న‌కు ఏకంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను క‌ల్పించ‌డంపై మ‌రింత మేర విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.


More Telugu News