ఐరాస భద్రతా మండలి అత్యవసర భేటీ.. ర‌ష్యా తీరుపై భార‌త్‌, అమెరికా ఆగ్ర‌హం

  • ఉద్రిక్తతలు తగ్గించ‌డానికి ప్ర‌స్తుతం ప్రాధాన్యం ఇవ్వాలి
  • ఐరాస‌లోని భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి విజ్ఞ‌ప్తి
  • ఉక్రెయిన్ ప్రజల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం
  • దీర్ఘకాల శాంతి, సుస్థిరత కోసం చర్యలు చేపట్టాల‌ని విన‌తి
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో, తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ర‌ష్యా తీరుపై ప‌లు దేశాలు ఆగ్రహం వ్య‌క్తం చేశాయి. ఆ ఇరు దేశాల‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్ర‌పంచ‌ దేశాలకు చట్టబద్ధంగా ఉండే భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల‌ని చెప్పింది.

ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య‌ ఉద్రిక్తతలు తగ్గించ‌డానికి ప్ర‌స్తుతం ప్రాధాన్యం ఇవ్వాల‌ని భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి ఐరాస‌కు తెలిపారు. ఉక్రెయిన్ ప్రజల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. దీర్ఘకాల శాంతి, సుస్థిరత కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మ‌స్య‌కు పరిష్కారం లభించే వరకు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని అన్నారు.  

ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్ ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ.. రష్యా చర్యల వల్ల ఉక్రెయిన్ లోనే కాకుండా ప్రపంచమంతా భయానక పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఉక్రెయిన్‌ సైన్యంతో అక్కడి వేర్పాటు వాదులు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న మ‌రిన్ని దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భద్రతా బలగాలను ఆయ‌న‌ శాంతి పరిరక్షకులుగా పేర్కొనడం స‌రికాద‌ని చెప్పారు.

ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా గుర్తింపునిస్తున్నామంటూ రష్యా చేసిన ప్ర‌క‌ట‌నపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. అంతర్జాతీయ ప్రాదేశిక సమగ్రతతో పాటు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని తాము భావిస్తున్నామ‌ని తెలిపారు.

మ‌రోవైపు, పుతిన్‌ చర్యలను బ్రిట‌న్ కూడా తప్పుబట్టింది. ఉక్రెయిన్‌కు అవసరమైన మేరకు తమ మద్దతు ఉంటుందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తెలిపింది.


More Telugu News