సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ ఆటగాడు.. భారత క్రికెటర్ ను ఆకాశానికెత్తేసిన పొలార్డ్

  • భారత్ కోసం ఏదైనా చేయగలడు
  • ప్రపంచ స్థాయి ఆటగాడు
  • పదేళ్లలో ఎంతో మెరుగయ్యాడు
  • అతడితో కలసి ఆడే అవకాశం అదృష్టమన్న పొలార్డ్ 
వెస్టిండీస్ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పట్ల ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్-భారత జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ తో అర్ధ సెంచరీ చేయడం తెలిసిందే. 31 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తన ఆటతో ఫలితాన్ని భారత్ వైపు ఉంచడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్ అనంతరం పొలార్డ్ దీనిపై మాట్లాడాడు.

పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు సహచరులు కావడం గమనార్హం. సూర్యను 360 డిగ్రీల ఆటగాడిగా పొలార్డ్ అభివర్ణించాడు. ‘‘సూర్య ప్రపంచస్థాయి ఆటగాడు. అతడు 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటి నుంచి అతడితో కలసి ఆడుతున్నాను. అప్పటి నుంచి అతడు ఎంతో మెరుగుపడడాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. 360 డిగ్రీ ఆటగాడిగా భారత్ కోసం, అతడి కోసం గొప్పగా ఏదైనా చేయగలడు’’ అని పొలార్డ్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు వేలానికి ముందు అట్టిపెట్టుకున్న నలుగురిలో సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ ఉండడం వారి పట్ల జట్టు యాజమాన్యానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనం.


More Telugu News