కీవ్ కు ప్రత్యేక విమానం.. 20 వేల మంది భారతీయుల క్షేమమే ప్రాధాన్యం..: భారత్

  • ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం
  • ఉక్రెయిన్ లోని భారతీయులను వెనక్కి వెళ్లాలని సూచన
  • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి భారతీయుల క్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం కీవ్ లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఉదయం 7.40 గంటలకు చేరుకుంది. ఈ వారంలో కీవ్ కు మూడు విమాన సర్వీసులను నడిపించనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఉక్రెయిన్ లోని 20,000 మంది భారతీయుల క్షేమమే తమకు మొదటి ప్రాధాన్యంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ప్రకటించారు. కీవ్ లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే తన రాయబార ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులను ఉక్రెయిన్ వీడి వెళ్లిపోవాలని కోరింది. అత్యవసరం కాని పనుల్లో ఉన్న వారు అందరూ తిరిగి భారత్ కు వెళ్లిపోవాలని సూచించింది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల పట్ల తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇరువైపులా సంయమనం పాటించాలని, సమస్యను ద్వైపాక్షిక మార్గాల్లో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత్ అభిమతంగా ఆయన పేర్కొన్నారు.


More Telugu News