పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకో.. మహిళా ఎస్సైపై తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు

  • విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఘటన
  • ఇసుకను తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్న గ్రామస్థులు
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై
  • అసభ్యంగా మాట్లాడిన తహసీల్దార్
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దారు కృష్ణమూర్తి ఓ మహిళా ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనిచేతకాకపోతే గేదెలు కాచుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

మండలంలోని గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండ్లలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిన్న ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వివాదం చెలరేగింది.

విషయం తెలిసిన ఎస్సై జయంతి గ్రామానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఎస్సై మాటలను గ్రామస్థులు లెక్కచేయకపోవడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న తహసీల్దారు కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ ఎస్సై జయంతితో అసభ్యకరంగా మాట్లాడారు.

 గ్రామస్థులను అక్కడి నుంచి పంపించడంలో విఫలమయ్యారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకోవాలని, ఎందుకీ ఉద్యోగమని ప్రశ్నించారు. కాగా, మహిళా ఎస్సైని దూషించిన తహసీల్దార్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.


More Telugu News