రెండేళ్ల తర్వాత రెడీ అవుతున్న అంతర్జాతీయ విమానాలు!

  • కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం నిలిచిపోయిన సేవలు
  • మార్చి 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు 
  • పుంజుకుంటున్న దేశీయ విమాన రంగం
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల క్రితం నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పౌర విమానయాన శాఖ నుంచి ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ మార్చి 15 నుంచి సేవలు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే దేశీయ విమాన రంగం పుంజుకుంటూ కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. దేశీయ ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మరో రెండు నెలల్లో ప్రయాణికుల సంఖ్య కరోనా మునుపటి పరిస్థితికి చేరుకునే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే చాలా దేశాలు నిబంధనలు సడలించాయి. కొన్ని దేశాలు పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.


More Telugu News