వెలవెల బోతున్న శ్రీశైలం జలాశయం

  • 805 అడుగుల దిగువకు నీటిమట్టం
  • చివరి మెట్టు వరకు తగ్గిపోయిన నీరు
  • 216 టీఎంసీలకు 31 టీఎంసీలే
  • శివరాత్రి సందర్భంగా భక్తులకు జల్లు స్నానాలు
వేసవికి ముందే శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటింది. డ్యామ్ లో నీటి మట్టం 805 అడుగులలోపునకు తగ్గిపోయింది. 215.80 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 31 టీఎంసీల నీరే ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇక నీటిని తరలించే అవకాశం ఉండదు.
 
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. జలాశయంలో నీరు చాలా కిందకు వెళ్లిపోవడంతో భక్తుల పవిత్ర కృష్ణమ్మ స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. మెట్ల మార్గంలో చివరి వరకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేయడంపై ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గత ఏప్రిల్ నుంచి చూసుకుంటే శ్రీశైలం జలాశయంలోకి మొత్తం 1,118 టీఎంసీల నీరు వచ్చింది. దిగువనున్న నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు 1,086 టీఎంసీల నీటిని విడుదల చేశారు. పెద్ద ఎత్తున జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని కిందకు వదిలారు.


More Telugu News