పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్

  • ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు
  • ఒకే విడతలో 117 స్థానాలకు ఎన్నికలు
  • ముగిసిన ప్రచార పర్వం
  • ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన
ఈ నెల 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ చేపట్టనున్నారు. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలని తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మేనిఫెస్టో ప్రకటించింది. సీఎం చరణ్ జిత్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1,100 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు, ప్రతి కుటుంబానికి ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటూ జనరంజకమైన హామీ ఇచ్చింది.

పంజాబ్ లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా, శుక్రవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పీసీసీ చీఫ్ సిద్ధూ మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్ గెలిస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. కాగా, ఈసారి పంజాబ్ లో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ ఈ పర్యాయం బీజేపీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కోవాల్సి ఉంది.


More Telugu News