అసోం సీఎంపై గీతారెడ్డి, రేణుకా చౌదరి ఫిర్యాదు

  • రాహుల్ గాంధీపై అసోం సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
  • సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడు హేమంత అన్న గీతారెడ్డి, రేణుకా చౌదరి
  • తండ్రి ఎవరనే ఆధారాల గురించి ఎవరైనా మాట్లాడుతారా? అని ప్రశ్న
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ అని చెప్పడానికి తాము ఆధారాలు అడిగామా? అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

తాజాగా హేమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీతారెడ్డి, రేణుకా చౌదరి కలిసి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ... సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడు హేమంత అని అన్నారు. రాహుల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు.

సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని అడిగితే... తండ్రి ఎవరనే ఆధారాల గురించి ఎవరైనా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. హేమంత నీచమైన మాటలు మాట్లాడినా రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. బీజేపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. హేమంతపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ అంశం తన పరిధిలోకి రాదని, దీన్ని కేంద్ర కమిషన్ కు పంపిస్తానని చెప్పారని తెలిపారు.


More Telugu News