కాల్పులతో దద్దరిల్లిన తూర్పు ఉక్రెయిన్.. వేర్పాటువాదులు, సైన్యం పరస్పర ఆరోపణలు

  • గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులు జరిపారన్న సైన్యం
  • సైన్యమే తొలుత కాల్పులకు దిగిందన్న వేర్పాటువాదులు
  • రష్యాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడం తథ్యమంటూ వార్తలు వస్తున్న వేళ తూర్పు ఉక్రెయిన్‌లోని కాడివ్కా ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై అటు వేర్పాటు వాదులు, ఇటు ఉక్రెయిన్ సైన్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు తెగబడ్డారని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తుంటే.. సైన్యమే తమపై తొలుత కాల్పులకు దిగిందని వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో నాలుగుసార్లు సైన్యం తమపై కాల్పులు జరిపిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకున్నా, ఇద్దరు పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది.

సరిహద్దుల్లో కాల్పుల ఘటనపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ ఆక్రమణపై కన్నేసిన రష్యా అందుకు కారణాన్ని చూపించేందుకు మారణహోమాన్ని సృష్టించే యత్నం చేస్తోందని ఆరోపించింది. మరోపక్క, రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించబోతోందంటూ వచ్చిన ఆరోపణలను ఆ దేశం కొట్టిపడేసింది. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే లక్షలాదిమంది సిబ్బందిని వెనక్కి పిలిపించినట్టు పేర్కొంది. 


More Telugu News