సింగపూర్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అసంతృప్తి... సమన్లు జారీ

  • సింగపూర్ పార్లమెంటులో ఓ తీర్మానంపై చర్చ
  • ప్రసంగించిన ప్రధాని లీ సీన్ లూంగ్
  • భారత ఎంపీలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని వ్యాఖ్యలు
  • నెహ్రూ నడయాడిన భారత్ ఇప్పుడిలా ఉందని వెల్లడి
సింగపూర్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు ఆగ్రహం కలిగించాయి. గత ఏడాది సింగపూర్ పార్లమెంటులో వర్కర్స్ పార్టీ మాజీ ఎంపీ అవాస్తవాలు వెల్లడించాడన్న అంశంపై తీర్మానం సందర్భంగా ప్రధాని లీ సీన్ లూంగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
 
తొలితరం నేతలు ఎంతో ఆదర్శప్రాయులుగా కొనసాగినా, కొన్ని దశాబ్దాల అనంతరం నేతల తీరుతెన్నులు మారిపోతాయని అన్నారు. వారి ప్రవర్తన, వ్యవహారశైలి తొలితరం నేతలకు భిన్నంగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో సింగపూర్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తావన తీసుకువచ్చారు. నెహ్రూ వంటి మహోన్నత నేత పరిపాలించిన భారత్ లో ఇప్పుడున్న పరిస్థితులే అందుకు నిదర్శనమని తెలిపారు.

భారత మీడియా కథనాల ప్రకారం లోక్ సభలో సగం మంది ఎంపీలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయని, వాటిలో అత్యాచారాలు, హత్యలు వంటి తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయని లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు. వీటిలో చాలావరకు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని అన్నారు.

అయితే, సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత కేంద్రప్రభుత్వం భగ్గుమంది. భారత్ లో సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. సింగపూర్ ప్రధాని పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అసందర్భోచితం అని నిరసన తెలియజేసింది. లీ సీన్ లూంగ్ వ్యాఖ్యలపై వివరణ కావాలని స్పష్టం చేసింది.


More Telugu News