క్రిప్టో కరెన్సీలను సుఖవ్యాధిగా పేర్కొన్న ముంగర్.. గట్టి కౌంటర్ వేసిన మస్క్

  • టెస్లా ఫెయిలవుతుందని ముంగర్ నాడు చెప్పారు
  • నాకు బాధ కలిగించింది
  • ప్రయత్నించడం మంచిదే కదా అని చెప్పా
  • నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్న మస్క్
క్రిప్టో కరెన్సీలపై విఖ్యాత ఇన్వెస్టర్, బెర్క్ షైర్ హాతవే వైస్ ప్రెసిడెంట్ చార్లీ ముంగర్ చెప్పిన జ్యోతిష్యానికి.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గట్టి కౌంటర్ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీని వెనీరియల్ డిసీజ్ (సుఖ వ్యాధి)గా ముంగర్ పోల్చారు. క్రిప్టో కరెన్సీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఎలాన్ మస్క్ కు ముంగర్ ప్రకటన ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. దీనిపై మస్క్ గట్టిగా స్పందించారు.

టెస్లా ఫెయిల్ అవుతుందంటూ 2009లో ముంగర్ చేసిన వ్యాఖ్యలను మస్క్ తాజాగా గుర్తు చేశారు. ‘‘2009లో ముంగర్ తో నేను లంచ్ చేశాను. టెస్లా అన్ని విధాలుగా ఫెయిల్ అవుతుందంటూ టేబుల్ వద్ద కూర్చున్న అందరికీ ముంగర్ చెప్పారు. నాకు చాలా బాధ కలిగించింది. ఆయన చెప్పిన అన్ని కారణాలతో ఏకీభవిస్తున్నానని ముంగర్ కు చెప్పాను. బహుశా మనం చనిపోతాము. కానీ, ఏదైనప్పటికీ ప్రయత్నించడం విలువైనదే అవుతుంది కదా అని చెప్పాను’’ అంటూ నాటి సందర్భాన్ని మస్క్ గుర్తు చేశారు.
 
కానీ, నేడు టెస్లా ఎలక్ట్రిక్ కార్లలోనే ప్రపంచ దిగ్గజంగా ఎదిగింది. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారిపోయారు. అంటే ముంగర్ అంచనాలు తప్పినట్టు అర్థమవుతోంది. మస్క్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నారు. క్రిప్టోల విషయంలోనూ ముంగర్ అంచనాలు తప్పుతాయా? చూడాలి. కానీ, ముంగర్ మొదటి నుంచి క్రిప్టోలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేశీ ప్రముఖ ఇన్వెస్టర్ జున్ జున్ వాలా సైతం వీటికి భవిష్యత్తు లేదని తేల్చేయడం గమనార్హం.


More Telugu News