బ్రిటన్ లో కరోనా కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’ గుర్తింపు

  • డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలతో కూడిన కేసులు
  • బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటన
  • పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడి
బ్రిటన్ లో కరోనా కొత్త రకం ‘డెల్టాక్రాన్’ కేసులను గుర్తించారు. కరోనా రెండో విడతలో డెల్టా రూపంలోను, మూడో విడతలో ఒమిక్రాన్ రూపంలోను ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడడం తెలిసిందే. ఈ రెండు రకాలను పోలిన లక్షణాలు కనిపిస్తుండడంతో దీన్ని డెల్టాక్రాన్ గా పిలుస్తున్నారు. వాస్తవానికి డెల్టాక్రాన్ ను మొదటిసారిగా సైప్రస్ లో గత డిసెంబర్ లో గుర్తించారు.

డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలు డెల్టాక్రాన్ కేసుల్లో ఉన్నట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) ప్రకటించింది. ఈ కేసులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ, లక్షణాల తీవ్రత గురించి వివరాలు వెల్లడించలేదు. కరోనా డెల్టా వేరియంట్ లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు నమోదవడం తెలిసిందే. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలకే పరిమితమైంది.

అయితే, డెల్టాక్రాన్ మునుపటి వేరియంట్ల మాదిరిగా అంత ప్రభావం చూపించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, సైప్రస్ లో తొలుత ఈ రకాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు మాత్రం ఇది మునుపటి రకాల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.


More Telugu News