వారానికి నాలుగు రోజులే పని.. ఆ తర్వాత బాస్ ను కూడా పట్టించుకోవక్కర్లేదు!

  • బెల్జియంలో ఉద్యోగులకు కొత్త పని విధానం
  • ప్రకటించిన అధ్యక్షుడు అలెగ్జాండర్ డీ క్రూ
  • పార్లమెంటు ఆమోదిస్తే అమల్లోకి
వారానికి నాలుగు రోజులే పని. అంటే 38 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇక కార్యాలయ సమయం ముగిసిన తర్వాత ఆఫీసు నుంచి వచ్చే మెస్సేజ్ లు, బాస్ నుంచి వచ్చే కాల్స్ ను పట్టించుకోవక్కర్లేదు. ఫోన్ స్విచాఫ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ బెల్జియంలో ఉద్యోగుల కోసం ప్రకటించిన కొత్త చర్యలు.

ఉద్యోగం/వృత్తిజీవితం-వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యం, నాణ్యమైన జీవనం కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డీ క్రూ తెలిపారు. కరోనానంతరం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మిక చట్టాల్లో కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్రస్తుతం బెల్జియంలో వారానికి ఐదు రోజుల పని విధానం నడుస్తోంది. వారానికి నాలుగు రోజులకు పనిని కుదించినా, వేతనాల్లో కోత ఉండదు.

కావాలంటే ఒక వారంలో అధిక సమయం పాటు అదనంగా పనిచేయవచ్చు. తర్వాతి వారంలో తక్కువ సమయం పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కార్మిక సంఘాలు సమ్మతి తెలిపితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ దీన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. తర్వాత పార్లమెంటు ఆమోదం తీసుకుంటారు. స్కాట్లాండ్, ఐస్ లాండ్, స్పెయిన్, జపాన్ కూడా నాలుగు రోజుల పని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి.


More Telugu News