విజయవాడకు నేడు నితిన్ గడ్కరీ.. బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ప్రారంభం

  • గతేడాది డిసెంబరులోనే  ప్రారంభించాల్సి ఉండగా గడ్కరీ పర్యటన వాయిదా
  • నేడు అధికారికంగా ప్రారంభించనున్న కేంద్రమంత్రి
  • కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులకు భూమి పూజ
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా బెంజిసర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌తోపాటు పలు జాతీయ రహదారులను మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

వాస్తవానికి బెంజిసర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌ను గతేడాది డిసెంబరులోనే గడ్కరీ ప్రారంభించాల్సి ఉండగా అప్పట్లో ఆయన పర్యటన రద్దయింది. అయినప్పటికీ వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫ్లై ఓవర్‌పై వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడీ ఫ్లై ఓవర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో గడ్కరీ, జగన్, మంత్రులు పాల్గొంటారు. అక్కడి నుంచే కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో పాల్గొంటారు. రూ. 5,480 కోట్లతో ఈ రహదారులను నిర్మించనున్నారు.

అలాగే రూ. 6,465 కోట్లతో నిర్మించిన పలు జాతీయ రహదారులను కూడా గడ్కరీ లాంఛనంగా ప్రారంభిస్తారు. వీటిలో కలపర్రు-చిన్న అవుటపల్లి, కంచికచర్ల, నందిగామ ఆరు వరుసల బైపాస్ రహదారులు ఉన్నాయి.

అలాగే, గుడివాడ-రాజమండ్రి సెక్షన్‌లో ఒక ఫ్లై ఓవర్, గుడివాడ-మచిలీపట్నం సెక్షన్‌లో మరో ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


More Telugu News