ఎన్నికల ముందు పంజాబ్ సీఎం చన్ని వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ, ఆప్

  • యూపీ, బీహార్ భయ్యాలను రానీయవద్దు
  • ఎన్నికల సభలో, ప్రియాంక సమక్షంలో చన్ని పిలుపు
  • యూపీ, బీహార్ ప్రజలను అవమానించార్న బీజేపీ
  • ప్రియాంక యూపీకి చెందినవారేనన్న కేజ్రీవాల్
పంజాబ్ ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యూపీ, బీహార్ కు చెందిన భయ్యాలను పంజాబ్ లోకి రానివ్వకండి’’అని ఆయన పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఉండడమే కాకుండా, చన్ని వ్యాఖ్యలకు అభినందనగా నవ్వుతూ, ఆమె చప్పట్లు కొట్టడం కనిపించింది.

దీనిపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు మండిపడ్డాయి. పంజాబ్ ముఖ్యమంత్రి యూపీ, బీహార్ ప్రజలను అవమానించారని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ గెలుపు కోసం యూపీలో పోరాడుతుండగా.. ఆ రాష్ట్ర ప్రజలను ప్రియాంక గాంధీ అవమానించారని వ్యాఖ్యానించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది ఎంతో సిగ్గుపడే విషయం. వ్యక్తులు లేదా ఏదైనా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే ఇలాంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రియాంక గాంధీ కూడా యూపీకి చెందిన వారే. కనుక ఆమె కూడా భయ్యానే’’అంటూ చన్నీకి కేజ్రీవాల్ చురకంటించారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ చరణ్ జిత్ సింగ్ చన్నినే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే.


More Telugu News