సినీ సంగీత 'ఆకాశంలో ఒక తార'.. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లిన బప్పీలహరి!

  • కలకత్తాలో జన్మించిన బప్పీలహరి
  • బప్పీలహరిని తెలుగులో పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ
  • టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలకు స్వరాలు
  • చివరి సినిమా 'పాండవులు పాండువులు తుమ్మెద'
  • రవితేజ ‘డిస్కో రాజా’లో చివరి పాట
బప్పీలహరి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగులో ఆయన సృష్టించిన పాటల ప్రవాహం ఇప్పటికీ, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సగటు ప్రేక్షకుల గొంతు ఆయన పాటలను ‘హమ్’ చేస్తూనే ఉంటుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత అర్ధరాత్రి కన్నుమూశారు.

చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న బప్పీలహరి కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అపరేశ్ లహరి ప్రముఖ బెంగాలీ గాయకుడు. తల్లి బన్సారీ లహరి సంగీతకారిణి, గాయకురాలు కూడా. శాస్త్రీయ సంగీతం, శ్యామా సంగీత్‌లో నిష్ణాతురాలు. తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన బప్పీకి స్వతహాగానే చిన్నప్పటి నుంచి సంగీతంపై మనసు మళ్లింది. సంగీత ప్రపంచంలో దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చిన్నప్పటి నుంచే ఆయన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

మూడేళ్ల వయసులో ఉండగానే తబలా వాయించేవాడు. ఆ వయసులోనే తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకునేవాడు. ఆ తర్వాత అందులో ప్రొఫెషనల్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన చిత్రాణిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా గాయకుల కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. బప్పీలహరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె రేమా కూడా ప్రముఖ సింగరే కావడం మరో విశేషం. ఆయన కుమారుడు బప్పా లహరి కూడా సంగీత దర్శకుడే. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో పనిచేస్తున్నారు.

'బంగారు' మనిషి.. 

బప్పీలహరి సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించారు. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు తన సంగీత సుస్వరాలలో ఓలలాడించారు. ఆయన డ్రెసింగ్ సెన్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆయన వార్డ్ రోబ్‌లో సంప్రదాయ భారతీయ కుర్తా, షేర్వాణి నుంచి పాశ్చాత్య స్వెట్‌షర్టులు, బ్లేజర్స్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఆహార్యం గురించి. బంగారమంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఆయన ఎప్పుడూ ఒంటినిండా బంగారు ఆభరణాలు, సన్‌గ్లాసెస్‌తో కనిపించేవారు.

తెలుగుతో అనుబంధం

బప్పీలహరి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. హిట్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. సూపర్ స్టార్ కృష్ణ ఆయనను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఆయన స్వయంగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన ‘సింహాసనం’ సినిమాతో  బప్పీలహరిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమాలోని 'ఆకాశంలో ఒక తార...' పాట ఇప్పటికీ, ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇదే సినిమాను హిందీలో ‘సింఘాసన్’ పేరుతో నిర్మించారు. అప్పటికే ‘డిస్కో డ్యాన్సర్’ పాటలతో దేశాన్ని ఉర్రూతలూగించిన బప్పీలహరి ‘సింహాసనం’ సినిమాను తన పాటలతో మరో రేంజ్‌కు తీసుకెళ్లారు.

ఆ తర్వాత కూడా కృష్ణ నటించిన 'తేనె మనసులు', 'శంఖారావం' సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అప్పట్లో బప్పీలహరి సంగీతమంటే యమా క్రేజ్. చిరంజీవి సినిమాలు 'స్టేట్ రౌడీ', 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', బాలకృష్ణ 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'నిప్పు రవ్వ', మోహన్‌బాబు నటించిన 'రౌడీగారి పెళ్లాం', 'పుణ్యభూమి నాదేశం' సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు.

అలాగే, 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో 'చూశాలే.. చూశాలే' పాటకు ఆయన బాణీలు సమకూర్చారు. తెలుగులో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన చివరి సినిమా కూడా ఇదే. ఆ తర్వాత రవితేజ నటించిన 'డిస్కో రాజా' సినిమాలో ‘రమ్ పమ్ రమ్’ పాటను ఆయన ఆలపించారు. గాయకుడిగా ఆయన చివరి సినిమా ఇదే!


More Telugu News