రాజ్యసభ సీటుపై సంకేతాలు ఇవ్వలేదు: అలీ

  • సీఎం జగన్ ను కలిసిన అలీ
  • మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు వివరణ
  • వైఎస్ కుటుంబంతో ఎప్పటినుంచో పరిచయం ఉందని వెల్లడి
  • సినీ ప్రముఖులను అవమానించలేదని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ భేటీ ముగిసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తాడేపల్లి వచ్చిన అలీ... సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్టు స్పష్టం చేశారు.

అప్పుడు రాలేకపోయాను..

సీఎం సార్ పెళ్లి కాకముందు నుంచే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందని అలీ వెల్లడించారు. "మొన్న మా పెళ్లిరోజు నాడే సీఎంను కలుద్దామని అనుకున్నాం. కానీ వేరే మీటింగ్ ఉండడంతో రాలేకపోయాను. మా ఆవిడ కూడా సార్ తో ఒక ఫోటో దిగాలని ఎప్పటినుంచో అడుగుతోంది. తప్పకుండా తీసుకెళతానని ఆమెకు ప్రామిస్ చేశాను. అది ఇవాళ కుదిరింది" అంటూ అలీ వివరణ ఇచ్చారు.

రెండు వారాల్లో పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ఉండొచ్చు

సీఎంను కలవాలంటూ నిన్న ఆహ్వానం వచ్చిందని, అందుకే ఇవాళ కుటుంబంతో కలిసి వచ్చానని వివరించారు. రాజ్యసభ సీటు గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని, అయినా తాను పదవి కోసం పార్టీలోకి రాలేదని అలీ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారని, అయితే సమయం లేక తానే వద్దన్నానని చెప్పారు. అయితే రెండు వారాల్లో పార్టీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన రావొచ్చని వెల్లడించారు.  

సినీ ప్రముఖులను సీఎం అవమానించారన్నది అవాస్తవం

ఇటీవల టాలీవుడ్ ప్రముఖులను సీఎం జగన్ చర్చలకు పిలిచి అవమానించారన్న దాంట్లో నిజంలేదని అన్నారు. పిలిచి అవమానించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. చిరంజీవిని సీఎం ఎంతో గౌరవంగా చూశారని తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు.


More Telugu News