కేసీఆర్ ప్రధాని మోదీకి కోవర్టు... రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి
  • భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్
  • కేసీఆర్ పై ధ్వజం
  • యూపీఏని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణ
ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కోవర్టు అని ఆరోపించారు. ఈ కోవర్టు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్టు నటించి, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు దగ్గరై వాళ్ల మధ్యన చిచ్చు పెడతాడని వివరించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చి, మోదీ పీఠాన్ని పదిలం చేయడానికి ప్రయత్నిస్తాడని అన్నారు. మోదీకి అనుకూలంగా పనిచేయడానికి ఈ కోవర్టు గ్యాంగ్ సుపారీ తీసుకుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"కేసీఆర్ ఇప్పుడు ఎవరెవరితో చర్చిస్తున్నారో మీరే ఆలోచించండి. మమతా బెనర్జీతో, స్టాలిన్ తో, ఉద్ధవ్ థాకరేతో, ఆర్జేడీ నేతలతోనే మాట్లాడుతున్నారు. వీళ్లందరూ యూపీఏ భాగస్వాములు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నవాళ్లు, సోనియా నాయకత్వాన్ని, కాంగ్రెస్ ను సమర్థిస్తున్నవాళ్లు. వీళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంటో, ఫెడరల్ ఫ్రంటో, లేక థర్డ్ ఫ్రంటో లేక మరే దిక్కుమాలిన ఫ్రంటో ఏర్పాటు చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని చెడగొట్టడానికి మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్ పనిచేస్తున్నారు.

నిజంగానే మోదీని ఓడించాలి, ఎన్డీయే సర్కారును గద్దె దింపాలి అనుకుంటే.... అటు బీజేపీతో కానీ, ఇటు కాంగ్రెస్ తో కానీ కలిసి పనిచేయని పక్షాలు కొన్ని ఉన్నాయి. కేసీఆర్ వాటితో జట్టు కట్టి మోదీపై పోరాడాలి. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటకలో దేవెగౌడ, అఖిలేశ్ యాదవ్ వంటి నేతలు ఎవరితో కలవకుండా ఉన్నారు. కేసీఆర్ ఇలాంటి వాళ్లతో కలిసి పోరాడాలి. కానీ కేసీఆర్ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ యూపీఏను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు" అని రేవంత్ రెడ్డి విమర్శించారు.


More Telugu News