కడప జైలర్ వరుణారెడ్డి బదిలీ... ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం

  • ఇప్పటికే డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్ బదిలీ
  • తాజాగా వరుణారెడ్డి ఒంగోలు జైలుకు బదిలీ
  • ఒంగోలు జైలర్ ప్రకాశ్ కడపకు బదిలీ
  • ఇటీవల వరుణారెడ్డిపై చంద్రబాబు సందేహాలు
ఏపీ సర్కారు పోలీసు, జైళ్ల శాఖలో కీలక బదిలీలు చేస్తోంది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా కడప జైలు ఇన్చార్జి సూపరింటిండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్ గా బదిలీ అయ్యారు. అదే సమయంలో, ఒంగోలు జైలు సూపరింటిండెంట్ గా ఉన్న ప్రకాశ్ ను కడప జైలర్ గా బదిలీ చేశారు.

ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైల్లోనే హత్యకు గురైనప్పుడు వరుణారెడ్డి జైలర్ గా ఉన్నారని, ఇప్పుడదే వరుణారెడ్డి కడప జైలర్ గా ఉన్నారని చంద్రబాబు తెలిపారు.

కడప జైల్లో ప్రస్తుతం వివేకా హత్య కేసు నిందితులు ఉన్నందున, వారిని హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వరుణారెడ్డి కడప జైలర్ గా ఉండడంపై తమకు అనుమానంగా ఉందని, దీనిపై తాము సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఏపీ ప్రభుత్వం వరుణారెడ్డిని కడప జైలు నుంచి ఒంగోలు కారాగారానికి బదిలీ చేసింది.


More Telugu News