జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ.. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియామకం

  • కేంద్ర సర్వీసులకు ప్రవీణ్ ప్రకాశ్ భార్య భావనా సక్సేనా
  • ఆమె స్థానంలో ప్రవీణ్ ప్రకాశ్ నియామకం
  • గత ప్రభుత్వ హయాంలోనూ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేసిన ప్రవీణ్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ భార్య, ఐపీఎస్ అధికారి భావనా సక్సేనా కేంద్ర సర్వీసులకు వెళ్తుండడంతో ఆ స్థానంలో ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అంతేకాదు, చాలాకాలంపాటు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) పోస్టును కూడా నిర్వహించారు.  

ఈ క్రమంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆయన నిర్వహిస్తున్న సబ్జెక్టుల్లో కొన్ని కీలకమైన వాటిని ఇటీవల ఆయన నుంచి తప్పించి వేరేవారికి అప్పగించారు. కాగా, గత కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రకాశ్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం మాత్రం ఆయనను ఎంప్యానెల్‌ చేయలేదు. దీంతో రాష్ట్ర కేడర్‌లోనే ఆయన ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తారు.


More Telugu News