సురేశ్ రైనాను తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం

  • ఐపీఎల్ వేలంలో రైనాకు మొండిచేయి
  • రైనాపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
  • చెన్నై సూపర్ కింగ్స్ దీ అదే బాట
  • గతంలో చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా రైనా
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేశ్ రైనా పాత్రను తీసిపారేయలేం. డాషింగ్ బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ ఎంతో చిత్తశుద్ధి కనబర్చే రైనాను ఈసారి వేలంలో చెన్నై కొనుగోలు చేయలేదు. చెన్నై జట్టులో ధోనీని పెద్ద తాలా అని పిలుచుకునే అభిమానులు, రైనాను చిన్న తాలా అంటారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు... సీఎస్కే అభిమానులు రైనాను ఎంత అభిమానిస్తారో!

కానీ, నిన్నటితో ఐపీఎల్ వేలం ముగియగా, రైనాను సూపర్ కింగ్స్ కాదు కదా ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. "గత 12 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యంత నిలకడగా సేవలు అందించిన కీలక ఆటగాళ్లలో రైనా ఒకడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టులో లేకపోవడం నిజంగా బాధాకరమే. కానీ ప్రస్తుత జట్టు కూర్పులో రైనాకు చోటు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఓ ఆటగాడికి ఫామ్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. మేం కూడా ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాం. ఫామ్ ఆధారంగా చూస్తే ఇప్పుడున్న చెన్నై జట్టులో రైనా ఇమడలేడు" అని స్పష్టం చేశారు.

గత సీజన్ సమయంలో రైనా అర్థాంతరంగా జట్టు నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. పంజాబ్ లో రైనా బంధువుల ఇంటిపై దొంగలు దాడి చేశారు. రైనా బంధువులు ఈ ఘటనలో మరణించారు. దాంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన రైనా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చేశాడు. అంతేకాదు, యూఏఈలో ఉన్న సమయంలో తనకు బాల్కనీ లేని గది ఇచ్చారంటూ రైనా రాద్ధాంతం చేశాడని కథనాలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  చెన్నై యాజమాన్యం అసంతృప్తికి గురైనట్టు వార్తలు వచ్చాయి.


More Telugu News