రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మోహన్ బాబు!

  • సినిమాలు, యూనివర్శిటీ పనుల్లో బిజీగా ఉన్నా
  • మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
  • చంద్రబాబు, జగన్ ఇద్దరూ తనకు బంధువులేనన్న మోహన్ బాబు 
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తనకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేదని అన్నారు. తనకు చంద్రబాబు, జగన్ ఇద్దరూ బంధువులేనని, అందుకే వారి తరపున ప్రచారం చేశానని చెప్పారు.

గతంలో చంద్రబాబుకు ప్రచారం చేశానని, 2019 ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను సినిమా వ్యవహారాలు, తన యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నానని... ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని చెప్పారు.

తన ఇంటికి మంత్రి పేర్ని నాని వస్తే రకరకాలుగా ప్రచారం చేశారని మోహన్ బాబు మండిపడ్డారు. పేర్ని నానితో తనకు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ కు రావాలని తానే పేర్ని నానిని ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన తనతో మాట్లాడలేదని, ఒక స్నేహితుడిగానే మాట్లాడారని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం గురించి తాము చర్చించలేదని అన్నారు. సీఎంతో వాళ్లు ఏం మాట్లాడారో చెప్పాలని ఒక మంత్రిని ఎలా అడుగుతామని ప్రశ్నించారు. అప్పుడప్పుడు కలుసుకుందామని అనుకున్నామని చెప్పారు.


More Telugu News