కనీస ధర రూ.40 లక్షలు... ఐపీఎల్ వేలంలో రూ.8.25 కోట్లు పలికిన సింగపూర్ ఆటగాడు

  • ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
  • టిమ్ డేవిడ్ కు అదిరిపోయే ధర
  • గతంలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాసుల వర్షానికి పర్యాయపదంగా మారింది. సాధారణ ఆటగాళ్లు సైతం కోటీశ్వరులుగా మారే వేదికగా ఐపీఎల్ ను పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. అందుకు టిమ్ డేవిడ్ ఉదంతమే సిసలైన నిదర్శనం.

పేరు చూస్తే ఏ ఇంగ్లండ్ ఆటగాడు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాడో అనుకుంటాం. కానీ టిమ్ డేవిడ్ సింగపూర్ ఆటగాడు. సింగపూర్ కు టెస్టు హోదా కూడా లేదు. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెటర్ కు ఐపీఎల్ లో ఏమంత ధర పలుకుతుందిలే అని భావిస్తే అది ఎంత పొరబాటో ఇవాళ్టి వేలంలో వెల్లడైంది. 2

5 ఏళ్ల టిమ్ డేవిడ్ ను ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ విధ్వంసక బ్యాట్స్ మన్ కోసం ముంబయి రూ.8.25 కోట్లు వెచ్చించింది. అనేక జట్లు అతడి కోసం పోటీ పడినా, ముంబయిదే పైచేయి అయింది.

6.5 అడుగుల ఎత్తు ఉండే టిమ్ డేవిడ్ ఇప్పటివరకు 14 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 558 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేటు 158.52. టీ20ల్లో అతడి అత్యధిక స్కోరు 92 నాటౌట్. వివిధ లీగ్ ల్లో 85 టీ20లు ఆడిన టిమ్ డేవిడ్ 1,908 రన్స్ నమోదు చేశాడు. లీగ్ క్రికెట్లోనూ 150కి పైగా స్ట్రయిక్ రేట్ ఉంది. పైగా స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు.

గతంలో టిమ్ డేవిడ్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి ముంబయి ఇండియన్స్ కు ఆడనున్నాడు. టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.


More Telugu News