రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది: రాష్ట్రపతి కోవింద్

  • ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి
  • స్వాగతం పలికిన చిన్నజీయర్ స్వామి
  • చిన్నజీయర్ చరిత్ర సృష్టించారని కితాబు
హైదరాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతామూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన రాష్ట్రపతికి చిన్నజీయర్ స్వామి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించారు. అనంతరం రామానుజాచార్యుల పసిడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్వర్ణ విగ్రహాన్ని లోకార్పణ చేశారు.

రామానుజుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహం రూపొందించడం తెలిసిందే. సమతామూర్తి కేంద్రం భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా, సమతామూర్తి కేంద్రంలో శిలాఫలకాన్ని కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్రపతికి చిన్నజీయర్ స్వామి సమతామూర్తి కేంద్రం విశేషాలను వివరించారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు. సమతామూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని అన్నారు. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని, ఇక్కడి శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు.

శ్రీ రామానుజాచార్యులు సామాజిక అసమానతలను రూపుమాపారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెల్లడించారు. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని తెలిపారు. అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చిన్నజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు.


More Telugu News