ఈరోజు హైదరాబాదుకు వస్తున్న రాష్ట్రపతి... రాత్రికి ఇక్కడే బస!

  • ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజాచార్య వేడుకలకు హాజరుకానున్న కోవింద్
  • మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి
  • ఆహ్వానం పలకనున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాదుకు విచ్చేస్తున్నారు. ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారు.  

మధ్యాహ్నం 3.30 గంటలకు రామ్ నాథ్ కోవింద్ ముచ్చింతల్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం చినజీయర్ స్వామితో కలిసి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు.
 
మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ వైపు ఎవరూ రావద్దని పోలీసులు విన్నవిస్తున్నారు.


More Telugu News