హిజాబ్ ను టచ్ చేస్తే చేతులు నరుకుతా: రుబీనా ఖానం

  • అక్కాచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు
  • భారతదేశ గొప్పదనమే భిన్నత్వంలో ఏకత్వం
  • ఘూంఘట్, హిజాబ్ మన దేశ సంస్కృతిలో భాగం
హిజాబ్ వివాదంపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని ఓ విద్యాసంస్థ విద్యార్థినులు హిజాబ్ ధరించి రావద్దని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక హైకోర్టులో ఉంది. మరోవైపు ఈ వివాదంపై ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థినులు నిరసనలకు దిగారు. వీరికి సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు రుబీనా ఖానం మద్దతు పలికారు.

ఈ సందర్భంగా రుబీనా మాట్లాడుతూ, హిజాబ్ ను తాకేందుకు ప్రయత్నిస్తే చేతులు నరుకుతానని హెచ్చరించారు. మనదేశ అక్కాచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని చూస్తే వారు ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానాల్లా మారి హిజాబ్ ను తాకే వారి చేతులను తెగనరకడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. భారతదేశ గొప్పదనమే భిన్నత్వంలో ఏకత్వంలో ఉందని... ఈ దేశంలో ఎవరి మతాలను వారు స్వేచ్ఛగా అనుసరిస్తారని చెప్పారు. కొందరు నుదుట తిలకం దిద్దుకుంటారని, మరికొందరు హిజాబ్ ధరిస్తారని అన్నారు. ఘూంఘట్ (కొంగుతో ముఖాన్ని దాచుకోవడం), హిజాబ్ అనేవి మన దేశ సంస్కృతిలో భాగమని చెప్పారు. రాజకీయాల కోసం వీటిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా మహిళలను బలహీనులని భావించొద్దని చెప్పారు.


More Telugu News