కేంద్ర హోం శాఖ కీల‌క నిర్ణ‌యం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభజన సమస్యలపై స‌మావేశానికి పిలుపు

  • ఏ అంశాల‌ను చ‌ర్చించాల‌న్న దానిపై అధికారుల‌కు కేంద్ర హోం శాఖ స‌మాచారం
  • షెడ్యూల్ 9, 10లోని సంస్థ‌ల ఆస్తుల పంప‌కాల‌పై చ‌ర్చ‌
  • ఈ నెల 8న జ‌రిగిన స‌మావేశంలో క‌మిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోం శాఖ
  • ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాల‌ని కీల‌క నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని క‌మిటీ ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్ప‌టికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది.

స‌మావేశ అజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌న‌రుల స‌ర్దుబాటు, 7 వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుద‌ల అంశం కూడా ఉన్నాయి.  

కాగా, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.


More Telugu News