ఐపీఎల్ గత వేలాల్లో భారీ ధర పలికిన క్రికెటర్లు వీరే!

  • ధోనీ తొలి బోణీ 1.5 మిలియన్ డాలర్లు
  • 2008లో సీఎస్కే సొంతం
  • అదే ఏడాది కెవిన్ పీటర్సన్ కు అధిక ధర
  • క్రిస్ మోరిస్ ప్యాకేజీయే గరిష్ఠం 
బెంగళూరు కేంద్రంగా ఐపీఎల్ మెగా వేలం 2022 ఆవిష్కృతమవుతున్న సందర్భం ఇది. వేలంలో అందరికీ డిమాండ్ ఉండదు. మెరికల్లాంటి కొందరు ఆటగాళ్లే భారీ ఆఫర్లను దక్కించుకోగలరు. అప్పుడప్పుడు పెద్దగా తెలియని కొందరు యువ ఆటగాళ్లు కూడా కోట్లు పలికి ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.

2008లో తొలిసారి ఐపీఎల్ వేలంలో ఎంఎస్ ధోనీ భారీ ఆఫర్ (1.5 మిలియన్ డాలర్లు)ను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది కెవిన్ పీటర్సన్ కు ఆర్సీబీ 1.55 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. ఆండ్య్రూ ఫ్లింటాప్ కు ఇంతే మొత్తాన్ని ఇచ్చి సీఎస్కే సొంతం చేసుకుంది.

2009 వేలంలో కెవిన్ పీటర్సన్ కోసం ఆర్సీబీ 1.55 మిలియన్ డాలర్లు (సుమారు రూ.11 కోట్లు) ఆఫర్ చేయగా, ఆల్ రౌండర్ ఆండ్య్రూ ఫ్లింటాఫ్ కోసం సీఎస్కే కూడా ఇంతే మొత్తాన్ని బిడ్ చేసింది.

2010 వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు కిరాన్ పోలార్డ్ కోసం రూ.4.8 కోట్లు ఇవ్వజూపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కూడా షేన్ బాండ్ కోసం పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టింది.

2011 వేలంలో గౌతమ్ గంభీర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 14.9 కోట్లకు సొంతం చేసుకుంది.

2012 వేలంలో రవీంద్రా జడేజాకు సీఎస్కే రూ.12 కోట్ల ఆఫర్ ఇచ్చింది. తాజాగా జట్టు అట్టిపెట్టుకున్న నలుగురిలో జడేజా ఉన్నాడు. అతడికి రూ.16 కోట్లను ఫ్రాంచైజీ యాజమాన్యం ఖరారు చేసింది.  

2013లో గ్లెన్ మ్యాక్స్ వెల్ కు ముంబై ఇండియన్స్ రూ.6.3 కోట్లను ఆఫర్ చేసింది.

2014లో యువరాజ్ సింగ్ కోసం ఆర్సీబీ రూ.14 కోట్లు, దినేష్ కార్తీక్ కు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12.5 కోట్ల బిడ్ వేసి విజయం సాధించాయి.

2015లో యువరాజ్ సింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లకు తన్నుకుపోయింది.

2016లో షేన్ వాట్సన్ కు ఆర్సీబీ రూ.9.5 కోట్లు ఆఫర్ చేసింది.

2017లో బెన్ స్ట్రోక్స్ కు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రూ.14.5 కోట్ల బిడ్ వేసింది.

2018 వేలంలోనూ బెన్ స్ట్రోక్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.12.5 కోట్లతో సొంతం చేసుకుంది.

2019 వేలంలో జయదేవ్ ఉనద్కత్ కు రాజస్థాన్ రాయల్స్ 8.4 కోట్ల ఆఫర్ ఇచ్చింది.

2020 లో ప్యాట్ కమిన్స్ కు కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్ల బిడ్ వేసింది.

2021లో.. నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వేలాలను పరిశీలిస్తే..  దక్షిణాఫ్రికా పేసర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు, 2021లో రాజస్థాన్ రాయల్స్ అతడ్ని రూ.16.25 కోట్లకు వేలం పాడి సొంతం చేసుకుంది.


More Telugu News