రేపటి ఐపీఎల్ మెగా వేలం విశేషాలివే..!

రేపటి ఐపీఎల్ మెగా వేలం విశేషాలివే..!
  • 12, 13వ తేదీల్లో బెంగళూరులో వేలం 
  • వేలంలోకి 590 మంది ఆటగాళ్లు
  • 217 మంది కోసం ఫ్రాంచైజీల పోటీ
  • టాప్ ప్లేయర్లకు భారీ ధర
‘ఐపీఎల్ మెగా వేలం 2022’ బెంగళూరులో ఈ నెల 12న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. 13వ తేదీన ముగుస్తుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిస్నీ హాట్ స్టార్ లోనూ చూడొచ్చు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భారీగా 590 మంది క్రికెటర్లు వేలానికి రావడమే.

ఐపీఎల్ లోకి కొత్తగా అహ్మదాబాద్ ‘గుజరాత్ టైటాన్స్’, లక్నో ‘సూపర్ జెయింట్స్’ ఫ్రాంచైజీలను తీసుకోవడం తెలిసిందే. దీని కారణంగా ప్రతీ జట్టు నలుగురు ఆటగాళ్లనే అట్టిపెట్టుకుని మిగిలిన అందరినీ విడిచి పెట్టాలని ఐపీఎల్ పాలకమండలి కోరింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. కొన్ని జట్లు అయితే నలుగురిని కూడా ఉంచుకోలేదు.

228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి అందుబాటులో ఉంటారు. ఇందులో క్యాప్డ్ ప్లేయర్లు అంటే భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిన వారు. అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఇప్పటి వరకు భారత జట్టు తరఫున ఆడనివారు. అసోసియేటెడ్ నేషన్స్ కు చెందిన మరో ఏడుగురు క్రికెటర్లు కూడా ఉన్నారు.

కొత్తగా ఏర్పడిన రెండు జట్లు ముగ్గురి చొప్పున ఆటగాళ్లను ముందే ఎంపిక చేసుకున్నాయి. ఇప్పుడు 10 ఫ్రాంచైజీలకూ మంచి ఆటగాళ్లతో బలమైన జట్టును నిర్మించుకోవడం లక్ష్యం కానుంది. కనుక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. తద్వారా వేలంలో ఒక్కో ఆటగాడు రూ.కోట్లు పలకనున్నాడు.

ఇప్పటికే 10 జట్టు 33 క్రికెటర్లను తీసుకున్నాయి. కనుక 590 మంది ఆటగాళ్ల పూల్ నుంచి మరో 217 మందిని వేలంలో కొనుగోలు చేయనున్నాయి. ఈ విడత సుమారు 10 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు రూ.10 కోట్లపైన ధర పలుకుతారని అంచనా.

పంజాబ్ కింగ్స్ వద్ద రూ.72 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.62 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.59 కోట్లు, రాయల్ చాలంజెర్స్ బెంగళూరు టీమ్ వద్ద రూ.57 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.52 కోట్లు, సీఎస్కే వద్ద రూ.48 కోట్లు, కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద 48 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.48 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.47.5 కోట్ల చొప్పున బ్యాలన్స్ ఉంది. ఈ పరిధిలోనే ఆటగాళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది.


More Telugu News