సినీ నటుడు అలీని మళ్లీ కలవాలన్న సీఎం జగన్.. రాజ్యసభ‌కు పంపుతారంటూ ప్రచారం

  • గతంలో రాజమండ్రి సీటు ఆశించిన అలీ
  • ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సమయంలోనూ నిరాశే
  • మరో మూడు నెలల్లో ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు
  • అందులో ఓ సీటును మైనారిటీలకు కేటాయించే యోచన
  • దానిని అలీకే ఇవ్వాలని జగన్ నిర్ణయం?
ప్రముఖ సినీ నటుడు అలీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నట్టు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల వివాదంపై నిన్న చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ, పోసాని, రాజమౌళి, కొరటాల శివ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. చర్చల అనంతరం వారం రోజుల తర్వాత తనను కలవాలని అలీకి జగన్ సూచించారు. దీంతో అలీని రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఇందులో ఒక సీటును మైనారిటీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సీటును అలీకి కేటాయించాలని జగన్ చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల సందర్భంగా అలీ రాజమండ్రి టికెట్‌ను ఆశించినప్పటికీ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేకపోయారు.

ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగానూ అలీ పేరు తెరపైకి వచ్చినప్పటికీ అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో  జగన్ తనను కలవాలని అలీని కోరడం రాజ్యసభకు పంపేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై అలీ మాట్లాడుతూ.. సీఎం తనను వారం రోజుల తర్వాత కలవమన్నారని, ఆయన ఏమిస్తారో తనకు తెలియదని అన్నారు.


More Telugu News