మరో విడత ‘చార్జీల’ బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్న ఎయిర్ టెల్!

  • ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.163
  • దీన్ని ఈ ఏడాదే రూ.200కు చేర్చే ప్రణాళిక 
  • రూ.300 తీసుకెళ్లడమే లక్ష్యమన్న సంస్థ ఎండీ 
చార్జీలను శాసించే స్థాయికి టెలికం కంపెనీలు వచ్చేశాయి. జియో రంగ ప్రవేశం, 4జీ టెక్నాలజీ విప్లవంతో చిన్న చిన్న కంపెనీలన్నీ కనుమరుగైపోయాయి. టెక్నాలజీ, నెట్ వర్క్ సామర్థ్యం, స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు చిన్న కంపెనీలకు సాధ్యమయ్యే పనికాదు. అందుకే, జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి బడా సంస్థలే బరిలో మిగిలాయి. మరోపక్క, ప్రభుత్వ రంగంలో బీఎస్ఎన్ఎల్ జీవన్మరణ సమస్య ఎదుర్కొంటోంది. వొడా ఫోన్ కూడా వెళ్లిపోయేదే కానీ, కేంద్ర సర్కారు విధానపరమైన నిర్ణయాలతో ప్రాణం పోసింది.

ఈ మూడు ప్రైవేటు సంస్థలే మిగలడంతో ధరలను విడతల వారీగా పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు గణనీయంగా పెంచేశాయి. దీంతో అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ప్యాక్ కోసం నెలవారీగా రూ.250 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎయిర్ టెల్ అయితే రూ.300 వరకు వసూలు చేస్తోంది. అయినా చాలడం లేదన్న వాదనను ఎయిర్ టెల్ తరచూ వినిపిస్తోంది.

తాము భారీగా పెట్టుబడులుపెట్టి, మనుగడ సాగించాలంటే ఒక్కో వినియోగదారు నుంచి సగటున నెలవారీ ఆదాయం (ఏఆర్పీయూ) రూ.300 వరకు రావాలన్నది ఎయిర్ టెల్ చెప్పే నిర్వచనం. డిసెంబర్ త్రైమాసికం చివరికి ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.163గా ఉంది. దీన్ని 2022 ముగిసేలోగా రూ.200కు చేర్చుతామని తాజాగా ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంటే కనీసం 20 శాతం మేర ఈ ఏడాది బాదుడు ఉంటుందని తెలుస్తోంది.  

మరో విడత రేట్ల పెంపును అంచనా వేస్తున్నట్టు ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. తదుపరి కొన్నేళ్లలో ఏఆర్పీయూ రూ.300కు చేరుకుంటుందన్నారు.


More Telugu News