యూపీలో ప్రారంభమైన తొలి విడత పోలింగ్.. క్యూకడుతున్న ఓటర్లు

  • మొత్తం 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్
  • బరిలో 628 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.27 కోట్ల మంది
  • పట్టు కోసం కాంగ్రెస్.. ఉనికి కోసం బీఎస్పీ పోరు
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం ప్రారంభమైన తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. యూపీలో ఈ దశలో 11 జిల్లాల్లోని  58 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 628 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ పట్టుదలగా ఉండగా, గణనీయమైన స్థానాలను గెలుచుకుని పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. ఉనికి కాపాడుకోవడానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రయత్నిస్తున్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పట్, మీరఠ్, ఘజియాబాద్, హాపుడ్, గౌతమబుద్ధనగర్‌, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో జాట్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉండడంతో తొలి విడత ఎన్నికల్లో వీరిది కీలక పాత్ర కానుంది. 2017 ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని 58 సీట్లకు గాను బీజేపీ 33 స్థానాలను కైవసం చేసుకుంది. మరి ఈసారి ఇక్కడ ఎన్ని స్థానాలను కొల్లగొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News