ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగిన వ్యాపారి దంపతులు.. మోదీపై తీవ్ర ఆరోపణలు

  • ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో ఘటన
  • తన ఆత్మహత్యకు మోదీనే కారణమని ఆరోపణ
  • రైతులు, చిరు వ్యాపారులకు మోదీ హితుడు కాదన్న వ్యాపారి
  • భార్య మృతి.. వ్యాపారి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో వ్యాపారి భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లో రాజీవ్ తోమర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి ఆయనే కారణం అవుతారని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని అన్నారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని అన్నారు.

రాజీవ్ విషం తీసుకుంటుండగా ఆయన భార్య అడ్డుకోబోయారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘ప్రభుత్వం నా మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా నా మాట విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో హతాశురాలైన ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు. వారిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

2020లో విధించిన కరోనా లాక్‌డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు.


More Telugu News